బాలీవుడ్ ఇండస్ట్రీలో తనలాంటి వాళ్లకు అంతగా ప్రోత్సాహం ఉండదని, కొత్తదనాన్ని అంత త్వరగా అంగీకరించరని సంచలన వ్యాఖ్యలు చేసింది అగ్ర కథానాయిక తాప్సీ. గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉంటున్న ఈ భామ హిందీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సత్తా చాటుతున్నది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పరిశ్రమపై విమర్శలు చేసింది తాప్సీ. సినిమాలకు కంటెంట్ మాత్రమే ముఖ్యం కాదని, ఈ విషయం తాను నిర్మాతగా మారిన తర్వాత అర్థమైందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్లో కథ వినగానే ‘హీరో ఎవరు’ అని అడుగుతారు. నేను హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేశాను.
ఏరోజూ హీరోలు, సహనటులు ఎవరని అడగలేదు. కథ నచ్చితే సినిమా ఓకే చేశాను’ అని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ ‘ప్రస్తుతం పెద్ద సినిమాలకు మాత్రమే తగినంత ప్రచారం లభిస్తున్నది. చిన్న సినిమాల డిజిటల్ హక్కులను రిలీజ్‌కు ముందే చాలా తక్కువ ధరకు సొంతం చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ బిజినెస్‌పై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక చిన్న సినిమాల గురించి పట్టించుకునే వారే లేరు. కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించే విషయంలో ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. నాలాంటి వారు అలా ప్రయత్నిస్తే ఎలాంటి మద్దతు లభించదు. ఇలాంటి విషయాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది’ అని తాప్సీ పేర్కొంది.