బాలీవుడ్ కథానాయికల్లో తాప్సీది ఓ ప్రత్యేకమైన ఇమేజ్. తొలినాళ్లలో తను గ్లామర్ పాత్రలే పోషించింది. అయితే.. ‘పింక్’ సినిమా గ్లామర్ పాత్రల నుంచి ఆమెను గ్రామర్ పాత్రల వైపు మళ్లేలా చేసింది. దాంతో స్త్రీ ప్రాధాన్యతా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది తాప్సీ. ప్రస్తుతం ఆమె హిందీలో ‘గాంధారి’ అనే చిత్రంలో నటిస్తున్నది. కిడ్నాప్ అయిన కూతుర్ని రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసిన పోరాటమే ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతున్నది. దేవాశిష్ మఖజా దర్శకుడు. ఈ సినిమా నిర్మాణం చివరి దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘గాంధారి’ సినిమా గురించి మాట్లాడింది తాప్సీ. ‘ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాను. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశాను. కానీ తల్లిగా నటించే అవకాశం మాత్రం రాలేదు. తొలిసారి ‘గాంధారి’లో ఓ ఆడపిల్ల తల్లిగా నటిస్తున్నాను. నిజంగా ఇదినాకు అరుదైన అవకాశం. తల్లి పాత్రను ఆధారంగా చేసుకొని రూపొందే చిత్రాలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందరో తల్లులకు స్పూర్తినిచ్చే కథ ఇది’ అని ఆనందం వ్యక్తం చేసింది తాప్సీ.