Taapsee | తాప్సీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్ దిల్రుబా’. 2021లో ఓటీటీలో విడులైన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడీ సినిమాకు కొనసాగింపుగా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ రానుంది. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుండటంతో తాప్సీ ప్రమోషన్లో పాల్గొన్నది. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ఆమె మీడియాతో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
‘తానొక భిన్నమైన కథతో సినిమా చేయాలనుకుంటున్నానని దర్శకురాలు కనికా ధిల్లాన్ చెప్పారు. ఆ కథ నాకు చెబుతారా? అనడిగాను. సమయం చూసి చెబుతానని అన్నారామె. ఆ సమయంలో వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా. ఆ షూట్ పూర్తయ్యే సరికి, కనికా ధిల్లాన్ సినిమా పట్టాలెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఆ కథపై ఆశ వదులుకున్నా. అయితే.. ఓ రోజు నాకు కనికా నుంచి ఫోన్ వచ్చింది.
‘ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించొద్దు. స్క్రిప్ట్ నెరేట్ చేస్తాను.. ఆఫీస్‌కి రా’ అన్నారు. వెళ్లి విన్నాను. ఈ కథ నా కోసమే రాసినట్టు అనిపించింది. వెంటనే ఒప్పేసుకున్నా. ఇప్పుడు ఆ కథకు సీక్వెల్ చేయడం, అందులోనూ నేనే హీరోయిన్ కావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. మాతృకను మరిపించేలా సీక్వెల్ ఉంటుంది’ అని తెలిపింది తాప్సీ పన్ను.