ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా, డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో బోసుబాబు నిడుమోలు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ ద్వారా ఈ కథ తన వద్దకు వచ్చిందని, ఇందులోని సైకలాజికల్ థ్రిల్లర్ అంశం తనను బాగా ఆకట్టుకుందని తెలిపారు. నిర్మాత బోసుబాబుకు సినిమాపై ఉన్న ప్యాషన్ ఇండస్ట్రీకి మంచి చేస్తుందని, సాయికుమార్ వంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. సాయికుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా కథ విన్నప్పుడే తమకు చాలా కొత్తగా అనిపించిందని, నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లోనూ కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రియదర్శితో చేసిన సినిమా హిట్ అయినట్లుగానే, ‘సుయోధన’ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.
దర్శకుడు వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియదర్శి ఈ స్క్రిప్ట్ ఓకే చేయడంతోనే సినిమాపై నమ్మకం పెరిగిందని, సాయికుమార్ గారి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని చెప్పారు. నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, మంచి సబ్జెక్టుతో ఈ సినిమాను నిర్మించామని, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ సూచనలతో ప్రియదర్శిని ఎంపిక చేసుకున్నామని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, హీరోయిన్ ద్రిషిక చందర్, నటుడు దేవిప్రసాద్ తదితరులు సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. రామ్ జోగయ్య శాస్త్రి సాహిత్యం, కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి.