Sushmita Sen | 24 ఏళ్ల వయసులో పెద్ద కుమార్తె రెనీని దత్తత తీసుకున్నప్పుడు ఎదుర్కొన్న విమర్శలను, ఇబ్బందులను బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తాజాగా గుర్తుచేసుకుంది. ఒక సింగిల్ మదర్‌గా తల్లి కావాలనే తన నిర్ణయం వల్ల కెరీర్ ముగిసిపోతుందని అందరూ భావించారని, చివరికి తన మేనేజర్ కూడా తనను వదిలేసి వెళ్లిపోయాడని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుస్మితా సేన్ మాట్లాడుతూ.. “నేను రెనీని దత్తత తీసుకున్నప్పుడు నా మేనేజర్ నన్ను వదిలి పారిపోయాడు. ‘నీకు కెరీర్ పట్ల సీరియస్ నెస్ లేదు.. 24 ఏళ్లకే తల్లి అయిన వ్యక్తికి నేను మేనేజర్‌గా ఉండలేను’ అని చెప్పాడు. అంతేకాదు, ఇకపై నాకు హీరోయిన్గా అవకాశాలు రావని, కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోతానని చాలామంది హెచ్చరించారు అని సుస్మితా చెప్పుకోచ్చింది. అయితే తనకు పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు లభించనప్పటికీ, మాతృత్వమే తనను మరింత బలోపేతం చేసిందని సుస్మితా చెప్పారు. కూతురు వచ్చిన తర్వాతే నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఇచ్చాను. రెనీని దత్తత తీసుకున్న తర్వాత ‘ఆంఖే’, ‘మై హూ నా’, ‘మైనే ప్యార్ క్యూ కియా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాను. ఇటీవలి కాలంలో ‘ఆర్య’ వెబ్ సిరీస్, ‘తాలి’ బయోపిక్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన నటనతో అలరించాను అంటూ సుస్మితా చెప్పుకోచ్చింది.
ఇక సుస్మితా సేన్ జీవితంలో మాతృత్వానికి ఎప్పుడూ మొదటి స్థానమే ఉంటుంది. 2010లో ఆమె ‘అలీషా’ అనే మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. వీరిద్దరితో కలిసి తనదైన ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. సుస్మితా పెద్ద కుమార్తె రెనీ కూడా ప్రస్తుతం యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. భయం లేకుండా, ఒదిగి ఉండటాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నానని రెనీ పలు సందర్భాల్లో చెప్పారు. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన సుస్మితా సేన్, ఆ తర్వాత తన వ్యక్తిగత నిర్ణయాలపై వచ్చిన విమర్శలను ఏమాత్రం లెక్కచేయకుండా, అనుకున్నది సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.