Vaadivaasal | తమిళ స్టార్ నటుడు సూర్య తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ వెట్రిమారన్ దర్శకత్వంలో రాబోతున్న వాడివాసల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం వెట్రిమారాన్ తన తర్వాతి ప్రాజెక్ట్ శింబుతో చేయబోతుండగా.. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరితో పాటు ఆర్జే బాలాజీ (RJ Balaji) చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల వలన సూర్య వాడివాసల్ నుంచి తప్పుకున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. మరోవైపు వెట్రిమారన్ సూర్య కోసం ఆగలేక శింబుతో వాడివాసల్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై నిర్మాత కలైపులి ఎస్. థాన్ స్పందించాడు.
వాడివాసల్ నుంచి సూర్య తప్పుకున్నాడని వస్తున్న వార్తలు అబద్దమని.. త్వరలోనే సూర్య వాడివాసల్ సెట్స్‌లోకి ఎంటర్ అవుతాడని థాను వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రస్తుతం లండన్‌లో యానిమేషన్ పనులు చివరి దశలో ఉన్నాయని.. ఈ వర్క్ పూర్తి అయ్యిన తర్వాత త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుంది అని అన్నారు.
‘వాడివాసల్’ ప్రాజెక్ట్ చాలా కాలంగా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జల్లికట్టు నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. దీనికోసం సూర్య జల్లికట్టు శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాను వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు.