Suriya | అటు స్టార్‌గా ఇటు నటుడిగా రెండు విధాలుగా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోల్లో తమిళ అగ్రహీరో సూర్య ఒకరు. తెలుగునాట కూడా ఆయనకు అభిమానులు కోకొల్లలు. సూర్య నేరుగా తెలుగులో నటిస్తే చూడాలనే కోరికను కొన్నేళ్లుగా వివిధ సందర్భాల్లో అభిమనులు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సూర్య కూడా తెలుగు సినిమా చేసేందుకు అనువైన సందర్భం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆ సందర్భం రానేవచ్చింది. ఆయన డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకుడు. ప్రతిష్టాత్మక టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటైర్టెన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
హీరో హీరోయిన్లు సూర్య, మమితా బైజులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా, నిర్మాత ఎస్.రాధాకృష్ణ బౌండ్ స్క్రిప్ట్‌ని దర్శకుడు వెంకీ అట్లూరికి అందించారు. సార్, లక్కీభాస్కర్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక భూమికలు పోషిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. తెలుగుతోపాటు తమిళంలో కూడా ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.