కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తను నటిస్తున్న కొత్త సినిమా ‘వనంగాన్’ నుంచి తప్పుకున్నారు. దర్శకుడు బాల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సూర్య నటిస్తున్న 41వ చిత్రమిది. కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. చిత్రీకరణ జరుగుతుండగానే స్క్రిప్ట్‌లో చేస్తున్న మార్పుల విషయంలో సూర్య అసంతృప్తికి లోనయ్యారని, అందుకే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని దర్శకుడు బాల వెల్లడించారు. ఆయన స్పందిస్తూ…‘నేను రూపొందిస్తున్న కొత్త సినిమా నుంచి సూర్య హీరోగా తప్పుకున్నారు.
స్క్రిప్టులో కొన్ని మార్పులకు మా ఇద్దరి మధ్య అంగీకారం కుదరలేదు. ఆయనకున్న ఇమేజ్‌కు ఈ మార్పులు సరికావని అనిపించింది. సూర్య స్థానంలో మరో హీరో నటించబోతున్నారు. ఆయనతో త్వరలోనే మరో సినిమా రూపొందించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు. సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్లో వచ్చిన ‘శివపుత్రుడు’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.