Surya | తమిళస్టార్ హీరో సూర్య బాలీవుడ్లో అడుగుపెట్టనున్నారని, సీనియర్ బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య నటించనున్నారనీ.. ఓ వార్త బీటౌన్‌లో బలంగా వినిపిస్తున్నది. ఈ విషయంపై దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా ఐఫా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు నిజమేనని, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని, సమయం వచ్చినప్పుడు అధికారికంగా వెల్లడిస్తానని ఓం ప్రకాశ్ మెహ్రా తెలిపారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మహాభారతం ఆధారంగా రాకేష్ ఈ కథ రాసుకున్నారట.
ఈ సినిమాకు ‘కర్ణ’ అనే టైటిల్ కూడా ఆయన ఖరారు చేసినట్టు సమాచారం. 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కర్ణుడిగా సూర్య నటించనున్నట్టు గత కొంతకాలంగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయ్. రంగ్‌దే బసంతి, దిల్లీ 6, బాగ్ మిల్ఖా బాగ్, తుఫాన్ వంటి చిత్రాలతో గొప్ప దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న ఓం ప్రకాశ్ మిశ్రా.. సూర్యతో సినిమా చేస్తున్నారన్న వార్త సూర్య అభిమానులకు ఆనందాన్ని అందిస్తుంటే.. ఆ సినిమాలో సూర్య కర్ణుడిగా నటిస్తున్నాడనే వార్త ఆ ఆనందాన్ని మిన్నంటేలా చేస్తున్నది.