Suriya – Venky Atluri Combo | తమిళ అగ్ర నటుడు సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. గజిని, యముడు, బ్రదర్స్, ఆకాశం నీ హద్దురా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సూర్యకి తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని కోరిక ఉన్న విషయం తెలిసిందే. మంచి కథ దొరికితే చేస్తానని చాలా సినిమా ఈవెంట్లలో వెల్లడించాడు. దీంతో ఆయన త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో సూర్య పనిచేయబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చలేదు. ఇదిలావుంటే తాజాగా సూర్య తెలుగు స్ట్రెయిట్ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది.
తొలిప్రేమ, సార్, లక్కీ భాస్కర్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. మరోవైపు సూర్య చందూ మొండేటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.