Suriya | అమెరికా (America) టెక్సాస్‌లోని ఓ షాపింగ్ మాల్ (Texas mall shooting)లో ఇటీవల జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) (Aishwarya Thatikonda) అనే యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. కుమార్తె మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, ఐశ్వర్య తమిళ స్టార్ హీరో సూర్య (Suriya)కు వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న సూర్య తీవ్ర భావోద్వేగానికి (emotional ) గురయ్యారు. ఐశ్వర్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఫొటో వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ మేరకు ఐశ్వర్య కుటుంబానికి ఓ లేఖ రాశారు. ‘మాటలు రావడం లేదు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. టెక్సాస్‌లో జరిగిన భయంకరమైన కాల్పుల ఘటనలో మీ కుమార్తె ఐశ్వర్య మరణించడం చాలా బాధాకరం. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఆమె ఎప్పుడూ మీ జ్ఞాపకాల్లోనే ఉంటుంది’ అంటూ ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ‘ఇవి నీ మరణానికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు. నువ్వు అసలైన హీరోవి. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు నువ్వు ఒక ధ్రువతారవు. నువ్వు పంచిన ప్రేమ, నీ చిరునవ్వు ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచే ఉంటుంది’ అని సూర్య రాసుకొచ్చారు.
• Heartrending Words From @Suriya_Offl , Grieving The Loss Of #Aishwarya (A Passionate Fan Of #Suriya Anna, Was Shot In The Allen Mall Shooting In Texas) And Writing An Emotional Letter To The Family. pic.twitter.com/oUtbO9lwFN
— Aα∂hу🕊️ (@Aadhy_offl) May 19, 2023
ఐశ్వర్య స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి. ఐశ్వర్య ఎంఎస్ చదవడం కోసం మూడేండ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. అక్కడే ఎంఎస్ పూర్తయ్యాక పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న (ఇండియా కాలమానం ప్రకారం ఈ నెల 6న శనివారం రాత్రి) కుటుంబసభ్యులతో ఐశ్వర్య ఫోన్లో మాట్లాడింది. అనంతరం సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. మాల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో మొత్తం తొమ్మిది మంది దుర్మరణం చెందారు. వారిలో ఐశ్వర్య కూడా ఉంది. గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఐశ్వర్యను వేలిముద్రల ఆధారంగా అక్కడి పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.