అగ్ర హీరో సూర్య కథాంశాల్లో వైవిధ్యంతో పాటు పాత్రలపరంగా ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటారు. ఆయన సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందన్నది అభిమానుల మాట. అయితే గత కొంతకాలంగా ఆయనకు ఆశించిన విజయాలు దక్కడం లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నారాయన. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతున్నది. సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నది.
త్వరలో హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని టాక్. అయితే ఈ విషయమై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై సూర్య అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.