‘ఈ రోజు ఇలా ఉన్నామంటే కారణం భగవంతుడు. దైవకృప వల్లే సృష్టి నడుస్తున్నదని ప్రగాఢంగా నమ్ముతా. ‘రామాయణ’లో హనుమంతుడిగా మీ ముందుకు రాబోతున్నా. ఒక నటుడిగా నాకిది సవాల్.’ అని సన్నీడియోల్ అన్నారు. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకుడు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ పౌరాణిక హిందీ చిత్రంలో యశ్ రావణుడిగా కనిపించనున్నారు.
ఆంజనేయుడి పాత్రను సన్నీడియోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడారు. ‘నాకు స్వతహాగా ఈ తరహా పాత్రలు ఇష్టం. ఎందుకంటే సరదాగా ఉంటాయి. తేలిగ్గా జనాల్లోకి వెళ్లిపోతాయి. ఇప్పటివరకూ షూటింగ్లో అయితే పాల్గొనలేదు. అవతార్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ చిత్రాల తరహాలో ‘రామయాణ’ చిత్రాన్ని నితేష్ రూపొందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాలోని నా పాత్రకు చెందిన డెమో చూపించారు.
నిజంగా ఆశ్చర్యపోయా. హనుమంతుడి పాత్ర సామాన్యమైనది కాదు. దానికోసం ఎంతో జాగ్రత్తలు వహించాలి. నిష్టగా కూడా ఉండాలి. అందుకు తగ్గట్టుగా తయారవుతున్నా. కచ్ఛితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది.’ అని సన్నీడియోల్ తెలిపారు. కైకేయిగా లారాదత్తా, శూర్పనఖగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతున్నది. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి, మలి పార్ట్ 2027 దీపావళికి విడుదల కానున్నాయి.