Sunitha | ప్రముఖ గాయని సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ గురించి వర్ధమాన సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెట్లో తనను బాడీ షేమింగ్ చేశారని, వివక్ష చూపారంటూ ప్రవస్తి చేసిన కామెంట్స్‌పై తాజాగా సునీత స్పందించారు. ‘ప్రవస్తి.. నిన్ను బాల్యంలో నేనూ ముద్దుచేశా. ఈ వయసులో కూడా అలా చేస్తే బాగుండదు కదా. ఎవరు బాగా పాడినా మేం లీనమై భావోద్వేగానికి గురవుతుంటాం. ఆయా ఎపిసోడ్స్ నువ్వు గమనించలేదనుకుంటా అని సునీత పేర్కొంది.
నువ్వు ఎన్నో పాటల పోటీల్లో పాల్గొన్నావు కదా, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది,నియమ నిబంధనలు ఎలా ఉంటాయో నీకు తెలియదా? మా గురించి చర్చించే స్థాయికి వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది. మ్యూజిక్ విషయంలో ఛానల్స్‌కి కొన్ని పరిమితులు ఉంటాయనే విషయం కూడా ప్రజలకి తెలియజేయి. అన్ని పాటలు పాడే అవకాశం ఉండదు. ఈ విషయాలన్ని కూడా ప్రజలకి చెప్పు.. నిజంగా నేను సంతోషిస్తా’ అని సునీత చెప్పుకొచ్చారు. కేవలం హక్కులు ఉన్న పాటలను మాత్రమే పోటీలో పాడాల్సి ఉంటుంది అని సునీత తెలిపారు.
కాగ ప్రవస్తి ఆరోపణలని ఇప్పటికే లిప్సిక, హారికతో పాటు పలువురు సింగర్స్ కూడా ఖండించారు. ప్రవస్తికి కూడా నట్టి కుమార్ లాంటి ప్రముఖులు ప్రవస్తికి మద్దతుగా నిలబడుతున్నారు. అదే సమయంలో సంగీత దిగ్గజాల గురించి ప్రవస్తి ఇలాంటి ఆరోపణలు చేయడం ఏ మాత్రం సబబు కాదంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.కాగా ఈ పాపులర్ టీవీ షోకి గతంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జడ్జిగా ఉండేవారు.ఆయనే హోస్ట్‌గా ఉంటూ జడ్జిగా కూడా ఉన్నారు. ఇప్పుడు బాలు తనయుడు చరణ్ హోస్ట్ చేస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్ సునీత, గేయ రచయిత చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. ఎంతో మంది యువ సింగర్స్ ఈ సింగింగ్ షోలో సత్తా చాటి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలాంటి టీవీ షోపై ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతుండడం చర్చనీయాంశంగా మారింది.