‘ఎంతపెద్ద స్టార్స్‌ని అయినా క్యారెక్టర్లగానే చూస్తూ సినిమా తీసే ఫిల్మ్‌మేకర్ శేఖర్ కమ్ముల. ‘కుబేర’ సినిమాలో కూడా స్టార్స్ కనిపించరు. క్యారెక్టర్లే కనిపిస్తాయి. కచ్చితంగా ఆడియన్స్‌కి ఈ సినిమా న్యూ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నది’ అని నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు అన్నారు. ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో వారు నిర్మించిన చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు విలేకరులతో ముచ్చటించారు.
“లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల మాకు ఈ ఐడియా చెప్పారు. వినగానే ఈ కథకు ధనుష్ అయితే కరెక్ట్ అనిపించింది. ఆయనకు కథ వినిపిస్తే 20 నిమిషాల్లో ఓకే చేశారు. ఇక ఇందులోని మిలియనీర్ పాత్రకు నాగార్జునను తప్ప మరొకర్ని శేఖర్ ఊహించలేకపోయారు. మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్.. ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్.. సింగిల్ లైన్లో ఇదే ‘కుబేర’ సినిమా కథ.
తెలుగు, తమిళంలో స్ట్రైయిట్ గానూ, హిందీలో అనువాదంగానూ సినిమా విడుదల కానుంది’ అని నిర్మాతలు తెలిపారు. ఇంకా చెబుతూ ‘శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే ఎమోషన్స్ ఇందులోనూ పుష్కలంగా ఉంటాయి. ఈ సినిమాలోని సీన్స్ అన్నీ ముంబయ్‌లోని రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. గ్రాండ్‌గా 1600 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం’ అని తెలిపారు. తన కుమార్తె జాన్వీకి చిత్రనిర్మాణం పట్ల ఆసక్తి ఉందని, ఆమె త్వరలో నిర్మాతగా మారనున్నదని సునీల్ నారంగ్ తెలిపారు.