తమిళ అగ్ర నటుడు విజయ్ సినిమాలకు కామా పెట్టేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఆయన తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సందీప్ కిషన్ కథానాయకుడిగా లైకా సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం లైకా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘జాసన్ సంజయ్ కథ, ఆయన నరేషన్ నచ్చి ఈ సినిమా చేస్తున్నాం. ఇది పానిండియా పాయింట్. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అనేది మనం చాలా సందర్భాల్లో విన్నమాట. కానీ దానికోసం మనం ఎంత వెచ్చిస్తామనేదే ఈ సినిమా ప్రధానాంశం. థమన్ సంగీతం అందించబోతున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికేఎం తమిళ్ కుమరన్ చెప్పారు.