మంచి ప్రతిభ వున్న నటుడు సందీప్ కిషన్. వైవిధ్యమైన పాత్రలు, కథలు చేయాలనే తపన ఆయనలో వుంటుంది. ఐతే విజయాలే ఆయనకి కలిసిరావడం లేదు. ఈమధ్య కాలంలో సందీప్ చేస్తున్న సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. పాన్ ఇండియా ఎంటర్ టైనర్ గా చేసిన ‘మైఖేల్’ పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు సందీప్. ఐతే ఈ సినిమా ఫలితం సందీప్ ని పూర్తిగా నిరాశపరిచింది.
ఇప్పుడు సందీప్ చేతిలో ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా వుంది. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఇప్పుడు మరో కొత్త సినిమాని మొదలుపెట్టాడు సందీప్. ఈ చిత్రానికి సివి కుమార్ డైరెక్టర్. సందీప్, కుమార్ గతంలో ‘మాయవన్’ అనే సినిమా చేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
మంచి టెక్నికల్ టీం ఈ సినిమా పని చేస్తోంది. నాని దసరాలో చమ్కీల అంగీలేసి, ఓరివారి పాటలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి 2898 AD’ కోసం పనిచేస్తున్న కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు. అయితే టాలీవుడ్ కి సీక్వెల్స్ కలసిరావు అనే సెంటిమెంట్ వుంది. మరి సందీప్ చేస్తున్న ఈ సీక్వెల్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.