Suman | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ సూపర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అనే విషయం చాలా మందికి తెలుసు. ఎన్నో సినిమాల్లో ఆయన తన ఫైటింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించారు. త్వరలో విడుదల కాబోతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా OG లోనూ ఆయన తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆదివారం పాడేరులో జరిగిన ఒక కరాటే శిక్షణా ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ నటుడు సుమన్, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఓ ప్రత్యేక అభ్యర్థన చేశారు. తాను కూడా మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ హోల్డర్నేనని గుర్తుచేసుకున్న సుమన్ ఈ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నిపుణుడు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణని ప్రవేశపెట్టగలిగితే, విద్యార్థులకు శారీరక, మానసికంగా ఎంతో మేలు జరుగుతుంది. నేను కూడా దీనికి స్వచ్ఛందంగా తోడ్పడేందుకు సిద్ధంగా ఉన్నాను. గిరిజన ప్రాంతాల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు జరుగుతున్న కృషిని అభినందించారు సుమన్. కరాటే, జూడో వంటి కళల ద్వారా అక్కడి యువతలోని ప్రతిభను వెలికితీయొచ్చని, ఇది వారి భవిష్యత్తుకు దోహదపడుతుందని చెప్పారు.సినిమాల్లో విభిన్న పాత్రలతో పేరు తెచ్చుకున్న సుమన్, ప్రస్తుతం సామాజిక అంశాలపై కూడా చురుగ్గా స్పందిస్తున్నారు. ఆయన చివరిసారి 2023లో నితిన్ నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్” చిత్రంలో కనిపించారు.
సుమన్ చేసిన ఈ విజ్ఞప్తికి అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగం అని వారు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ మరియు సినీ వర్గాల్లో ఈ ప్రతిపాదనపై చర్చ మొదలయ్యే అవకాశముందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.