Suma | టాలీవుడ్లో యాంకర్‌గా ప్రత్యేక బ్రాండ్‌ను సొంతం చేసుకున్న సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే… సుమ కెరీర్ మొదలుపెట్టింది యాంకరింగ్‌తో కాదు, నటనతో. 90వ దశకంలోనే ఆమె నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దూరదర్శన్‌లో ప్రసారమైన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సుమ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా కూడా నటించారు. కానీ నటన ఆమెకు అంతగా సంతృప్తిని ఇవ్వలేదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుమ తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. “యాక్టింగ్‌లో ఫ్రీడమ్ ఉండదు. నా బాడీ లాంగ్వేజ్‌కు అది సూట్ అవ్వదని అర్థమైంది. అందుకే నటన నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె తెలిపారు. అదే సమయంలో ఈటీవీ, జెమిని వంటి ప్రైవేట్ టీవీ ఛానెల్స్ ప్రారంభం కావడంతో యాంకర్‌గా అవకాశాలు రావడం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పారు.
నటనను పూర్తిగా వదిలేయకపోయినా, అప్పట్లో అక్క, చెల్లి పాత్రలు, కొన్ని టీవీ సీరియల్స్‌లో కనిపించారు. ఆ సమయంలోనే నటుడు రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడి, అది వివాహానికి దారి తీసింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం రాజీవ్‌కు ఇష్టం లేకపోవడంతో టీవీ సీరియల్స్‌కే పరిమితమయ్యానని సుమ వెల్లడించారు. తన కుమారుడు రోషన్ గురించి మాట్లాడుతూ సుమ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే అతడు చాలా పొసెసివ్‌గా ఉండేవాడట. ఈవెంట్లలో లేదా టీవీలో సుమ ఇతర వ్యక్తులతో కనిపిస్తే విచిత్రంగా ప్రవర్తించేవాడని, ఒకసారి అయితే ఈవెంట్లో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి “నాన్నకి చెప్పేస్తా” అంటూ హెచ్చరించాడని నవ్వుతూ చెప్పారు. ఈ కారణంగానే సీరియల్స్ నుంచి కూడా క్రమంగా దూరమయ్యానని తెలిపారు.
ఒక దశలో తాను, రాజీవ్ కలిసి ఇండస్ట్రీ వదిలేసి బిజినెస్ చేద్దామనుకున్నామనీ, కానీ రాజీవ్‌కు నటనే జీవితం కావడంతో ఆ ఆలోచన ముందుకు వెళ్లలేదని చెప్పారు. యాంకర్‌గా అవకాశాలు పెరిగిన తర్వాతే తన జీవితం స్థిరపడిందని, ఇప్పుడు ప్రశాంతంగా ఉందని సుమ అన్నారు. ప్రస్తుతం సుమ ప్రధానంగా యాంకరింగ్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నుంచి పెద్ద టీవీ షోల వరకూ సుమే ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయారు. మధ్య మధ్యలో ప్రత్యేక పాత్రల్లో నటిగా కూడా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ‘ప్రియదర్శి ప్రేమంటే’ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించి మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. మొత్తానికి, నటిగా మొదలై యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ ప్రయాణం ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది.