Sukesh Chandra Shekar | రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మరోసారి ప్రేమ లేఖ రాశాడు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మండోలి జైలులో ఉన్న సుకేశ్ గతంలోనూ జాక్వెలిన్‌కు జైలు నుంచే ప్రేమలేఖలు పంపిన విషయం తెలిసిందే. ఆగస్టు 11న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పుట్టిన రోజు సందర్భంగా వంద మందికి ఐఫోన్ 15ప్రో ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఇటీవల శ్రీలంకన్ బ్యూటీ కొత్తపాట ‘యిమ్మీ యిమ్మీ’ పాట బాగుందంటూ లేఖలో అభినందించారు. తన లాయర్ ద్వారా సుకేశ్ మీడియాకు లేఖను విడుదల చేశాడు. తాను ఆ పాటను చాలాసార్లు చూశానని.. దాంతో వంద మందికి ఐఫోన్ 15 ప్రో కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. లేఖలో అందంపై ప్రశంసలు కురిపించాడు. సాంగర్ వంద మిలియన్ల వ్యూస్‌ను దాటిందని.. జాక్వెలిన్ బాలీవుడ్‌కి నిజమైన క్వీన్ అంటూ లేఖలో రాసుకొచ్చాడు.
ఇదిలా ఉండగా.. రూ.200కోట్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల బాలీవుడ్ బ్యూటీకి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలుసార్లు ఈడీ విచారించింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొన్నా.. ఈడీ అరెస్టు చేయలేదు. 2022 నవంబర్ 15న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో లంకన్ బ్యూటీని ఈడీ పలుమార్లు విచారించడంతో పాటు పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నది. సుకేశ్ నుంచి రూ.7కోట్లకుపైగా విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయి. ఆమెతో పాటు కుటుంబీకులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను జాక్వెలిన్ ఖండించింది. సుకేశ్ తనను మోసం చేసినట్లుగా చెప్పుకొచ్చింది.