Sukesh Chandrasekhar | రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జైలు కైదీ సుకేష్ చంద్రశేఖర్ తాజాగా విడుదల చేసినట్లుగా చెబుతున్న ఒక చేతిరాత లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ లేఖలో సుకేష్… నటి నోరా ఫతేహిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నోరా తనను డబ్బుల కోసం వేధించిందని, జాక్వెలిన్‌తో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలని రోజుకు పదిసార్లు ఫోన్ చేసి బతిమాలాడిందని ఆరోపించారు. మొరాకోలోని కసాబ్లాంకాలో ఇల్లు కొనుగోలు చేయడానికి తాను నోరాకు కోట్లాది రూపాయలు ఇచ్చానని సుకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. తాను బాధితురాలినంటూ నోరా చేస్తున్న డ్రామాను ఆపాలని, లేదంటే వారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను బయటపెడతానని హెచ్చరించారు. అయితే ఈ లేఖ అసలైనదే అయినప్పటికీ, అందులో సుకేష్ చేసిన ఆరోపణలు ఇంకా ధృవీకరించబడలేదని ఎన్డీటీవీ నివేదిక పేర్కొంది. ఈ మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలిగా ఉండగా, నోరా ఫతేహి విచారణలో సాక్షిగా, అనుమానితురాలిగా ఉన్నారు. ఈ ఇద్దరు నటీమణులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే పలుమార్లు విచారించింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను నోరా ఫతేహి గతంలోనే ఖండించారు.