Hey Bhagawan | ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్, ఇప్పుడు ‘హే భగవాన్’తో మరోసారి నవ్వించడానికి సిద్ధమయ్యారు. గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘రైటర్ పద్మభూషణ్’ ఫేమ్ షణ్ముఖ ప్రశాంత్ కథను అందించగా, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌తో పాటు ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఒక రహస్యమైన ‘ఫ్యామిలీ బిజినెస్’ చుట్టూ తిరిగే ఈ కథలో ఆ వ్యాపారం ఏంటో ఎవరికీ చెప్పకూడదనే ఆసక్తికర నిబంధనతో సాగే తండ్రీకొడుకుల ప్రయాణం హిలేరియస్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సీనియర్ నటుడు నరేష్ వి.కె సుహాస్ మధ్య సాగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ తర్వాత సుహాస్ మరియు శివాని నాగరం ఈ చిత్రంతో మరోసారి జంటగా నటిస్తున్నారు.