Jatadhara Movie – Sudheer Babu | లెజెండరీ సూపర్‌స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆయనకు హీరో సుధీర్ బాబుతో పాటు ‘జటాధర’ చిత్ర యూనిట్ ఘనంగా నివాళులర్పించింది. తెలుగు వెండితెరపై తన అద్భుతమైన నటన, తిరుగులేని చరిష్మా, ‘లార్జర్ దేన్ లైఫ్’ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినీ ప్రపంచంలో శాశ్వతమైన ముద్ర వేసిన కృష్ణ గారిని ఈ సందర్భంగా చిత్ర బృందం స్మరించుకుంది. ఈ సందర్భంగా శివుడి వేషధారణలో ఉన్న కృష్ణుడి ఫొటోను తాజాగా పంచుకుంది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘జటాధర’ చిత్రం ఇటీవలే తమ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, దివ్య విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భవాని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించిన ‘జటాధర’ చిత్రం, అభిమానులు, ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా రూపొందుతోంది. సినిమా విడుదల తేదీ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.