సినిమా పేరు: జటాధర
తారాగణం: సుధీర్‌బాబు, సోనాక్షిసిన్హా, నమ్రతా శిరోద్కర్, రాజీవ్ కనకాల, సుమ..
దర్శకత్వం: వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్
నిర్మాతలు: ఉమేశ్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింగ్హాల్, నిఖిల్ నందఆ, ప్రేరణా అరోరా..
తేలిగ్గా జనాల్లోకి వెళ్లిపోయే జానర్ ‘సూపర్ నాచురల్ థ్రిల్లర్’. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటే ఈ తరహా సినిమాలు తేలిగ్గా హిట్ అయి కూర్చుంటాయి. అందుకే ఈ జానర్లో సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో తెలీని ఆసక్తి. ‘జటాధర’ సినిమా ప్రమోషన్స్ మొదలైన నాటి నుంచి ‘ఈ సినిమాలో ఏదో ఉంది’ అనే ఆసక్తి జనాల్లో అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. భారీ నిర్మాణ విలువలు, బాలీవుడ్ హీరోయిన్లు సోనాక్షిసిన్హా, నమ్రాతా శిరోధ్కర్ చాలా విరామం తర్వాత నటించడం, సుధీర్‌బాబు సినిమాల్లో స్వతహాగా ఉండే యాక్షన్ ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం ‘జటాధర’ థియేటర్లలోకి వచ్చింది. మరి అందరూ అనుకున్నట్టు ఈ సినిమా మెప్పించేలా ఉందా? నొప్పించేలా ఉందా? తెలుసుకునే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
శివ(సుధీర్‌బాబు) ఓ ఘోస్ట్ హంటర్. దెయ్యాలను వెతకడం అతని హాబీ. అయితే అతనికి దెయ్యాలపై నమ్మకం ఉండదు. దెయ్యాలను వెతికి, దెయ్యం అనేది ఓ భ్రమ మాత్రమే అని సమాజాన్ని ఒప్పించడం అతని లక్ష్యం. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శిధిలావస్థలో ఉన్న ప్రదేశాలను, దెయ్యాలు ఉన్నాయి అని అందరూ నమ్మే చోట్లకూ అతని అర్ధరాత్రులు వెళ్లి వెతుకూ ఉంటాడు. ఎక్కడా అతనికి దెయ్యాల జాడ కనిపించదు. అయితే.. శివకు ప్రతి రాత్రీ ఓ కల వస్తుంటుంది. ఆ కలలో ఓ పిల్లాడ్ని ఓ తల్లి చంపేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో కలలో కనిపించిన పిల్లాడి ఫొటో అతని ఇంట్లోనే కనేపిస్తుంది. ఆ పిల్లాడెవరు? అని తల్లి దండ్రుల్ని నిలదీస్తాడు శివ. ఆ పిల్లాడు తానేనని అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంటాడు. అంతేకాక, ఇప్పుడున్న అమ్మానాన్న అతని సొంత తల్లిదండ్రులుకారనీ, వాళ్లు తన పెద్దమ్మ, పెదనాన్న అని, కలలో తనను చంపడానికి ప్రయత్నిస్తున్న స్త్రీనే తన కన్నతల్లేననీ, తన అమ్మానాన్నని ఓ దుష్టశక్తి బలి తీసుకున్నదని తెలుసుకుంటాడు. తన అమ్మానాన్న చనిపోయిన ప్లేస్‌కి వెళతాడు. అక్కడ తన అమ్మానాన్న ఆత్మల కదలిక శివకు అర్థమవుతుంది? ఆ తర్వాత ఏం జరిగింది? తన అమ్మానాన్నల చావుకు కారణమైన ఆ దుష్టశక్తిని శివ ఎలా అంతం చేశాడు? అనేది మిగతా కథ
విశ్లేషణ
లాజిక్కులతో పనిలేకుండా మ్యాజిక్కులతో ఇలాంటి సినిమాలను హిట్ చేసేయొచ్చు. కథనంలో పట్టు ఉంటే ఈజీగా జనాలకు ఇలాంటి కథలు ఎక్కేస్తాయి. స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త పడి, ఖర్చుకు వెనుకాడకుండా సినిమా తీస్తే ఇలాంటి సినిమా హిట్. కానీ ‘జాటధర’ విషయంలో స్క్రిప్ట్ దగ్గరే చాలా లోపాలు కనిపించాయి. ప్రథమార్థం అంతా స్లోగా, ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించకుండా, సాదాసీదాగా సాగింది. ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త బెటర్. కథలో ఆసక్తికరమైన ఎలిమెంట్సన్నీ ద్వితీయార్ధంలోనే ఉన్నాయి. కానీ వాటిని తెరకెక్కించే విషయంలో దర్శకులు ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది అనిపించింది. కనీసం పాత్రల ఫిట్నెస్ గురించి కూడా దర్శకులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఏదేమైనా ద్వితీయార్ధం ఆసక్తికరమైన మలుపులతో ఉత్కంఠను రేకెత్తించే కొన్ని సన్నివేశాలతో.. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఆడియన్‌ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా దర్శకులు తీశారు. మధ్యలో పాటలు, అనవసరపు ఫైట్లు, బిల్డప్పులు లేకపోవడం.. సినిమా అంతా ఒకే త్రెడ్ మీద నడవడం వల్ల ఆడియన్ కథలో నుంచి బయటకు రాడు. ఆ విషయంలో దర్శకులను అభినందించాల్సిందే.
నటీనటులు
సుధీర్‌బాబు తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ పాత్ర పోషణ కోసం చాలా కష్టపడ్డాడు కూడా. ైక్లెమాక్స్‌లో అతను చేసిన శివతాండవం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ధన పిశాచిగా కనిపించింది. ధన పిశాచిని అమ్మవారి రూపంలో చూపించడం కాస్త ఆక్షేపణీయం అని చెప్పక తప్పదు. వికృతమైన నవ్వులు, ఆహాకారాలు, వెకిలి చేష్టలు తప్ప ఆ పాత్రకు అంతకు మించి చేయడానికి ఏం లేదు. శిల్పా శిరోధ్కర్ది కూడా అంత గొప్ప పాత్రేం కాదు. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇందులో హీరోయిన్‌ది చెప్పోదగ్గ పాత్రేం కాదు. రాజీవ్‌కనకాల, ఝాన్సీ పాత్రలు ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా
ఈ సినిమా కథ రొటీన్. కథనం విషయంలో జాగ్రత్త పడితే బావుండేది. స్క్రిప్ట్ లోపం బాగా కనిపించింది. కెమెరా వర్క్ బావుంది. సీజీ వర్క్ కూడా అభినందనీయంగానే ఉంది. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటర్‌కి అయితే ఇంకా చాలా పనుంది. మొత్తంగా సాంకేతికంగా మెచ్చుకోదగ్గ సినిమానే.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. సూపర్నాచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ‘జటాధర’ నచ్చొచ్చు. అభిరుచి గల ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతమేరకు నచ్చుతుందో చూడాలి.
బలాలు
గ్రాఫిక్స్, సుధీర్‌బాబు నటన, ద్వితాయర్ధం..
బలహీనతలు
కథ, కథనం, కేరక్టర్ ఫిట్‌నెస్‌లేని పాత్రలు, సోనాక్షిసిన్హా పాత్ర గెటప్..
రేటింగ్ : 2.75/5