Sudeep | కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన తాజా చిత్రం ‘బిల్లా రంగా బాషా’ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకోనున్న సుదీప్, ఈ ఏడాది వేడుకలు మాత్రం గతంలోలాగా తన ఇంటి వద్ద జరగవని స్పష్టం చేశారు. సుదీప్ సోషల్ మీడియా ద్వారా చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “నా తల్లి లేకుండా నేను జరుపుకునే తొలి పుట్టినరోజు ఇది. ప్రతి సంవత్సరం మీ ప్రేమతో నా ఇంటి వద్ద పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉండేది. కానీ ఈసారి మానసికంగా నేను సిద్ధంగా లేను,” అని ఆయన పేర్కొన్నారు.
అభిమానులకు తాను దూరంగా ఉండాలనుకోవడం కాదని స్పష్టం చేసిన సుదీప్, “సెప్టెంబర్ 1న రాత్రి 12 గంటలకి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అందరూ ఒకే చోటు చేరాలని కోరుకుంటున్నాను. ఆ లొకేషన్‌ను త్వరలోనే తెలియజేస్తాను. కానీ దయచేసి సెప్టెంబర్ 2న నా ఇంటికి మాత్రం రాకండి. నేను ఇంట్లో ఉండను,” అని విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజును ఉత్సవంలా జరుపుకునే బదులు సేవా కార్యక్రమాలు చేస్తానని సుదీప్ తెలిపారు.“మీ ప్రేమే నా శక్తి. నేను సామాజిక కార్యక్రమాలను ఎప్పటిలాగే చేస్తాను. మీ ఆశీర్వాదాలు, మంచి మాటలే నాకు మించిన గిఫ్ట్” అని పేర్కొన్నారు. సుదీప్ విజ్ఞప్తికి స్పందిస్తూ వేలాది మంది అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు. “మీ మనస్థితిని అర్థం చేసుకోగలం అన్నా, మిమ్నల్ని మేము గౌరవిస్తాం” అనే పోస్ట్‌లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, సుదీప్ నటిస్తున్న ‘బిల్లా రంగా బాషా’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.