కర్ణాటకలో విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘సు ఫ్రమ్ సో’. ఈ సినిమాను అదే పేరుతో ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ నెల 8న విడుదల కానున్న ఈ సినిమాలో షనీల్ గౌతమ్, జె.పి.తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె.తుమినాడ్, దీపక్ పనాజే, మైమ్ రాందాస్ ముఖ్య పాత్రధారులు. జె.పి.తుమినాడ్ దర్శకుడు.
శశిధర్శెట్టి బరోడా, రవిరాయ్ కలసా, రాజ్ బి.శెట్టి నిర్మాతలు. ప్రమోషన్లో భాగంగా మంగళవారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా ట్రైలర్ సాగింది. ‘గ్రామీణ జానపద కథలు, మూఢ నమ్మకాలు మిళితమైన వినోదాత్మక ప్రయాణమే ‘సు ఫ్రమ్ సో’.
ఓ పల్లెటూరిలో జరుగుతున్న విచిత్ర సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓ వ్యక్తి ఆలోచన ఆ ఊరును గందరగోళంలోకి నెడుతుంది. ఆ తర్వాత నవ్వుల హంగామా మొదలవుతుంది.’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.చంద్రశేఖరన్, సంగీతం: సుమేద్.కె, నేపథ్య సంగీతం: సందీప్ తులసీదాస్.