సమ్మె సైరన్ మోగిన నాటినుంచి నిరవధిక చర్చలతో టాలీవుడ్ హీటెక్కిపోయింది. స్టూడియోలు, అవుడ్డోర్ యూనిట్లు షూటింగులకు సహకరించొద్దంటూ శుక్రవారం ఫిల్మ్‌ఛాంబర్ ప్రకటన విడుదల చేయడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. శనివారం కూడా నిర్మాతలకు, ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు మధ్య చర్చలు ముమ్మరంగా సాగాయి. ఈ సందర్భంగా వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు పలు ఆంక్షలతో కూడిన నిర్ణయాలు ప్రకటించగా, వాటిని ఎంప్లాయిస్ ఫెడరేషన్ అంగీకరించలేదని తెలుస్తున్నది. వివరాల్లోకెళ్తే.. శనివారం జరిగిన చర్చల్లో సినీ కార్మికుల వేతనాలు పెంపు విషయంలో నిర్మాతలు పలు ఆంక్షలతో కూడిన నిర్ణయాలను ప్రకటించారు.
రోజుకు 2000లోపు తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 15శాతం, రెండో ఏడాది 5శాతం, మూడో ఏడాది 5శాతం.. అలాగే వెయ్యిలోపు తీసుకునే కార్మికులకు తొలి ఏడాది 20 శాతం, రెండో ఏడాది సున్నా శాతం, మూడో ఏడాది 5శాతం మొత్తం మూడేళ్లలో మూడు విడతలుగా 25శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. అయితే.. ఇప్పటికే ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ముందు నిర్మాతలు కొన్ని డిమాండ్లను ఉంచారు.
నిర్ధేశిత సమయంలో కాల్షీట్స్ ఇవ్వాలని, అవసరాలకు సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్‌తో కూడా పనిచేయించుకుంటామని (స్కిల్ ఆధారంగా వేరే రాష్ట్రాల వారిని కూడా తీసుకోవడం), షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో అనేది ఉండకూడదని, ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో పనికి మాత్రమే డబుల్ కాల్షీట్ ఇస్తామని, మిగతా ఆదివారాల్లో సింగిల్ కాల్షీట్ వర్తిస్తుందని.. ఈ నాలుగు డిమాండ్లను కార్మిక సంఘాలు అంగీకరిస్తేనే వేతనాల పెంపు ఉంటుందని నిర్మాతలు తెగేసి చెప్పారు.
చిన్న నిర్మాతలు ఈ వేతన పెంపు భారాన్ని భరించలేని పరిస్థితులు ఉన్నందున, వారికి ఈ వేతనాల పెంపు వర్తించదని, చిన్న బడ్జెట్ సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయని నిర్మాత దామోదరప్రసాద్ తెలిపారు. ఈ నెల 4 నుంచి సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో షూటింగులు నిలిచిపోయాయి. తత్ఫలితంగా చిత్రపరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది.
అయితే… నిర్మాతల డిమాండ్లను తాము అంగీకరించమని, రేపటి నుంచి ఆందోళన ఉదృతం చేస్తామని చర్చల అనంతరం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ప్రకటించారు. తాము అడిగినట్టుగా 30శాతం వేతనాలు పెంచాల్సిందేనని, ఈ విషయంపై మేం కట్టుబడి ఉన్నామని, డాన్సర్లు, ఫైటర్లు, టెక్నీషియన్స్ వేతనాల విషయంలో నిర్మాతలు పూర్తి క్లారిటీ ఇవ్వాలని, అలాగే పీపుల్ మీడియా అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్ వర్కర్స్‌కి 90 లక్షలు బాకీ ఉన్నారని, వాటిని వెంటనే క్లియర్ చేయాలని అనిల్ వల్లభనేని డిమాండ్ చేశారు. చిన్న నిర్మాతలకు తాము పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఇదిలావుంటే.. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, 30శాతం వేతన పెంపు డిమాండ్‌కు తాను అంగీకరించినట్టుగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, నిజానికి తానెవరినీ కలవలేదని, ఇది పూర్తిగా అబద్ధమని అగ్ర హీరో చిరంజీవి తెలిపారు. వేతనాల పెంపు అనేది పరిశ్రమకు సంబంధించిన విషయమని, ఇది ఛాంబర్ మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయమని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలను గందరగోళంలోకి నెట్టే ఇలాంటి నిరాధారమైన ప్రకటనలు దయచేసి చేయొద్దని ఈ సందర్భంగా చిరంజీవి ప్రకటన ద్వారా తెలియజేశారు.