 
                                                            Stranger Things 5 | ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వెబ్ సిరీస్‌లలో ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things) సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మొదట్లో ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉన్న ఈ సిరీస్, అనంతరం తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలై ఆదరణ పొందింది. ఇప్పటికే నాలుగు సీజన్లు వచ్చిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ఐదో సీజన్‌ని తీసుకురాబోతుంది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, ఫినాలే అంటూ మూడు పార్టులుగా ఈ సీజన్ రాబోతుండగా.. మొదటి పార్ట్ నవంబరు 26న, రెండో పార్ట్ డిసెంబరు 25న, మూడో పార్ట్ డిసెంబరు 31 విడుదల చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా సీజన్5 కి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఓ చిన్న ఊరిలో విల్, మైక్, డస్టిన్, లూకస్ అనే నలుగురు పిల్లల జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓ రోజు వీరికి ‘ఎలెవన్’ అనే అమ్మాయి కనిపిస్తుంది. తమతో కలిసిన ఈ అమ్మాయికి అసాధారణ శక్తులు (సూపర్ పవర్స్) ఉన్నాయని తెలుసుకున్న ఆ పిల్లలు, ఆమెతో స్నేహం చేస్తారు. ఎలెవన్ శక్తుల సహాయంతో వీరంతా కలిసి తమ ఊరికి ప్రపంచానికి ఎదురయ్యే భయంకరమైన ప్రమాదాలను, అంతుచిక్కని శక్తులను ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనే అంశాలతో ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఈ చివరి సీజన్ సిరీస్‌కు ఎలాంటి ముగింపునిస్తుంది? అనేది తెలుసుకోవాలంటే.. నవంబర్ 26 వరకు వేచి చూడాలి.
 
                            