Rajamouli | మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి సోషల్‌మీడియాలో పంచుకున్న ఓ ఫొటో వైరల్‌గా మారింది. దీనికి ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అనే క్యాప్షన్ జత చేశారు రాజమౌళి. ఆఫ్రికాలోని అడవుల్లో ఆయన లొకేషన్ సెర్చ్ కోసం వెళ్లినట్లు తెలుస్తున్నది.
అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్‌బాబు సరికొత్త మేకోవర్‌తో సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించనున్న ఈ చిత్రం కోసం విదేశీ సాంకేతిక నిపుణులు కూడా పనిచేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి రూపొందించబోతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తినెలకొని ఉంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.