మీడియాకు అప్డేట్లు ఇవ్వకుండా.. ఏ మాత్రం లీకులు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా ‘SSMB 29’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. అయితే.. ఆయన ఎంత కట్టుదిట్టంగా ముందుకెళ్తున్నా.. ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. రీసెంట్గా కెన్యా షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన కాశీ సెట్లో తాజా షెడ్యూల్ మొదలైంది. హీరోహీరోయిన్లు మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాలతో పాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో భాగమయ్యారట. అక్టోబర్ 10 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుందని తెలిసింది.
ఈ సినిమాకు రాజమౌళి కాస్త డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌వారు ఇండియా మినహా మిగతా దేశాలన్నింటిలో ‘SSMB 29’ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారట. ఇటీవలే వార్నర్ బ్రదర్స్ సంస్థతో రాజమౌళి చర్చలు జరిపారనీ, ఈ విషయంపై వారు కూడా సుముఖత వ్యక్తం చేశారని, ఇరువురూ కలిసి ఓ ఒప్పందానికి వచ్చారని తెలిసింది. గ్లోబల్‌గా సినిమాను చేరువ చేసేందుకే రాజమౌళీ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.