SSMB 29 | సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులే కాదు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎస్ఎస్ఎంబీ 29 ప్రారంభమైన నాటి నుంచి ఈ సినిమా కథేంటీ? నటీనటులు ఎవరు ? టెక్నీషియన్స్ ఎవరు ? బడ్జెట్ ఎంత, షూటింగ్ లొకేషన్స్ ఏంటి అంటూ మహేశ్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. జూలై రెండో వారం నుంచి ఈ షెడ్యూల్ కెన్యాలో ప్రారంభంకానున్నట్లు సమాచారం.
కెన్యా షెడ్యూల్లో రాజమౌళి భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజ్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నట్టు టాక్ నడుస్తుంది. కెన్యాలోని అటవీ ప్రాంతంలో నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందట.. ఈ షెడ్యూల్ కోసం రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర చిత్ర యూనిట్ మొత్తం కెన్యాకు త్వరలో పయనం కానున్నారు. ఇప్పటికే కెన్యాలో చిత్ర షూటింగ్‌కి అనుమతి లభించినట్టు చెబుతున్నారు. కెన్యా లోని ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్ లో కూడా రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారని అంటున్నారు.
ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్ సరికొత్తగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఎస్ఎస్ఎంబీ 29 ఫోటోలు, సీన్స్, క్లిప్స్ ఎక్కడా లీక్ కాకుండా రాజమౌళి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు రాజమౌళి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ లో కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు రాజమౌళి.