మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం అప్డేట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. కానీ రాజమౌళి మాత్రం అవేం పట్టించుకోకుండా కామ్‌గా తన పనితాను చేసుకుంటూ పోతున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు గప్‌చుప్‌గా జరిగిపోతున్నాయట. ఫిల్మ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఈ ఏడాది మొత్తాన్నీ ప్రీప్రొడక్షన్ వర్క్‌కే కేటాయిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేది వచ్చే ఏడాదే అని తెలుస్తున్నది. తొలి షెడ్యూల్ జర్మనీలో ఉండబోతున్నదట.
ఈ షెడ్యూల్లోనే కొందరు విదేశీ నటులు కూడా భాగం కానున్నారని వినికిడి. 18వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ ఎపిసోడ్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యం అంతా ఆ ఎసిసోడ్లోనే ఉంటుందట. దీనికోసం రాజమౌళి ప్రత్యేకమైన స్కెచ్‌లు గీయిస్తున్నారని వినికిడి. అరుదైన గిరిజన జాతికి సంబంధించిన రిఫరెన్స్‌లు ఈ సినిమాలో ఉంటాయట. త్వరలోనే వీటికి సంబంధించిన స్కెచ్‌లు, కాస్ట్యూమ్స్ ఫైనలైజ్ చేయనున్నారు. దీనికోసం వందలమంది జూనియర్ ఆర్టిస్టులకు ముందే ట్రైనింగ్ ఇచ్చి, వారిని సిద్ధం చేయనున్నారట. దాదాపు వెయ్యికోట్ల భారీ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.