‘డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా 12న విడుదలైంది. నిజంగా కేసు వేయాలనుకుంటే ముందే వేయొచ్చు. కానీ లాస్ట్ మినిట్‌లో వచ్చి అడ్డంకులు సృష్టిస్తారు. ప్రపంచంలో ఐక్యత కరువైందనడానికి ఇదో నిదర్శనం. నేను, నాది అనే ఆలోచన పక్కనపెట్టి ‘మనది’ అని అనుకున్నప్పుడు ఇలాంటివి జరగవ్. అంతా సలహాలిచ్చేవాళ్లే. చానళ్లకెక్కి ప్రసంగాలు చేసేవాళ్లే. ధైర్యాన్నిచ్చే వాళ్లు మాత్రం లేరు. దెబ్బ తగిలితే బ్యాండెడ్ వెయ్యాలి కానీ.. రోడ్డుమీద కెక్కి బ్యాండ్ వాయించకూడదు. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలన్నింటినీ ప్రపంచమంతా తెలిసేలా చేసుకుంటున్నారు.
ఇది కరెక్ట్ కాదు. ఇది జనాల్లోకి చెడుగా వెళ్తుంది. మన తెలుగు సినిమా బయటవాళ్లంతా ఈర్ష్య పడేంత గొప్ప పరిశ్రమ. అలాంటి పరిశ్రమలో ఐక్యత అనేది ఉంటే ఇంకా ఎదుగుతుంది. యూనిటీగా ఉండాల్సిన సమయం ఆసన్నమయింది. ఈ సినిమా బిజినెస్ గురించి ప్రపంచానికి ఎందుకు తెలియాలి? లాస్ట్ మినిట్‌లో సినిమాను ఎందుకు ఆపాలి? రేపొద్దున్నే సినిమా విడుదలవుతుంటే.. విడుదల ఆగిందంటూ ట్వీట్ వేయాల్సిన ఖర్మ నిర్మాతలకు ఎందుకు? వారెంత కుమిలిపోయుంటారు. నిర్మాతలకూ ఒక కుటుంబం ఉంటుందని ఎందుకు ఆలోచించరు?’ అని సంగీత దర్శకుడు తమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ2 : తాండవం’. బోయపాటి శ్రీను దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సంగీత దర్శకుడు తమన్ ఆవేశంగా మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘సినిమా ఎప్పుడొచ్చిందని కాదు. వచ్చి ఏ స్థాయిలో ప్రభావం చూపించిందనేది ముఖ్యం. ఇందులో ప్రతి సీన్ ఒక ఉద్వేగం, ఉద్రేకం, ఒక ఉత్తేజ ప్రకంపనం. మనిషే దేవుడైతే ఏమవుతుందో అదే ‘అఖండ 2: తాండవం’. ఇంతటి ఘనవిజయాన్ని మీకు మీరిచ్చుకున్నందుకు ధన్యవాదాలు’ అన్నారు.
‘ఈ సినిమాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేం బాధపడలేదు. దేవుడే చూసుకుంటాడనే నమ్మకంతో ఉన్నాం. అదే జరిగింది. విడుదల తేదీ మారడం వల్ల థియేటర్లు తగ్గాయి. వసూళ్లు చూశాక ఇప్పుడు థియేటర్లు పెరుగుతున్నాయి. మనం గెలవడం కాదు.. సినిమా గెలవాలి. తెలుగు సినిమా పరిశ్రమ ఒక కుటుంబం లాంటిది. పొద్దున లెగిస్తే ముఖముఖాలు చూసుకోవాలి. బయటి వాళ్లు చూసి హేళన చేసేలా మనం ఉండకూడదు.’ అని దర్శకుడు బోయపాటి శ్రీను హితవు పలికారు. ఇంకా చిత్రబృందంతోపాటు దిల్‌రాజు, గంగాధర శాస్త్రి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.