హైదరాబాద్: ఎస్ఎస్ రాజమౌలి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల కాంబినేషన్లో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటింది. దేశ, విదేశీ ప్రేక్షకుల నుంచి అద్వితీయమైన స్పందనను రాబట్టింది. ఆ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కడంతో.. ఇటీవల ఆస్కార్ వేదికపై కూడా RRR చరిత్ర సృష్టించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో తెలుగు నేల దమ్మును చాటిచెప్పింది.
అయితే, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన RRR టీమ్‌లో అందరికీ ఫ్రీ ఎంట్రీ దక్కలేదట. కేవలం పాట రచయిత చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి వారి భార్యలకు మాత్రమే నిర్వాహకులు ఫ్రీ ఎంట్రీ టికెట్లు ఇచ్చారట. దాంతో దర్శకుడు రాజమౌలి తనకు, తన టీమ్ అంతటికీ స్వయంగా డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారట. అలాగని టికెట్ ధర తక్కువేమీ కాదట. ఒక్కో టికెట్‌కు 25 వేల అమెరికన్ డాలర్ల (రూ.20.60 లక్షలు) చొప్పున వెచ్చించాల్సి వచ్చిందట.
రాజమౌలితోపాటు ఆయన భార్య రమా రాజమౌలి, కొడుకు కార్తికేయ, కోడలు ఈ ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. అదేవిధంగా RRR హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ భార్యలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. వీళ్లందరికీ దర్శకుడు రాజమౌలినే ఎంట్రీ టికెట్లు కొనుగోలు చేశారట. అంతకుముందు కూడా RRR టీమ్ విషయంలో ఆస్కార్ అకాడమీ విమర్శల పాలైంది. రాజమౌలికి ఆయన బృందానికి వెనుక వరుసలో సీట్లు కేటాయించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.