Rajamouli | అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాను ఓ యజ్ఞంలా భావిస్తారు. కొబ్బరికాయ కొట్టింది మొదలు గుమ్మడికాయ కొట్టే వరకు ప్రతీ విషయంలో అత్యంత శ్రద్ధతో వ్యవహరిస్తారు. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన సమాచారంతో పాటు ఆర్టిస్టుల లుక్స్ తాలూకు ఫొటోలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబుతో పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీక్‌లకు ఆస్కారం లేకుండా రాజమౌళి టీమ్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదట.
అందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్-డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. చిత్ర బృందం అనుమతి లేకుండా సినిమా తాలూకు ఎలాంటి సమాచారాన్ని, విశేషాలను బయటకు వెల్లడించొద్దని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అగ్రిమెంట్లో పేర్కొన్నారట.
షూటింగ్ లొకేషన్లో ఫోన్లకు కూడా అనుమతి ఉండదని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటి ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.