దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇంకా మూడు రోజుల వ్యవధి మిగిలి ఉండగానే ఇప్పటికే దాదాపు 5 లక్షల టికెట్స్ అమ్ముడుపోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్‌ను పురస్కరించుకొని షారుఖ్‌ఖాన్ సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ తెలుగు అభిమాని నుంచి ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రిలీజ్ రోజున ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ఏదైనా థియేటర్‌కు మీరు వస్తున్నారా? అని ఆ యువకుడు షారుఖ్‌ను అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ ‘రామ్‌చరణ్ నన్ను ఏ థియేటర్‌కైనా తీసుకెళ్తే తప్పకుండా వస్తా’ అని బదులిచ్చాడు. ఈ సమాధానంతో రామ్‌చరణ్ అభిమానులు ఫిదా అవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘పఠాన్’ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.