KIng Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ (King) విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా అనౌన్స్మెంట్ వీడియోను పంచుకుంది. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి తొలిసారి వెండితెరను పంచుకోబోతుండటం విశేషం. ‘పఠాన్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సుమారు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో షారుఖ్ ఖాన్ ఒక శక్తివంతమైన డాన్ పాత్రలో కనిపిస్తుండగా, సుహానా ఖాన్ కీలకమైన శిష్యురాలి పాత్రలో మెరవనుంది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన విలన్‌గా నటిస్తుండటంతో షారుఖ్ మరియు అభిషేక్ మధ్య సాగే పోరాట దృశ్యాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గతేడాది ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన షారుఖ్, ఇప్పుడు ‘కింగ్’ సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకొని హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరికొత్త మేకోవర్‌తో షారుఖ్ ఖాన్ కనిపించబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వింటర్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీ సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.