Mahesh Babu Nephew Debut | సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయ కృష్ణ ఘట్టమనేని ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ హీరో డెబ్యూ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.’RX 100′, ‘మంగళవారం’ వంటి కల్ట్ హిట్లను అందించిన విజనరీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లెజెండరీ నిర్మాత అశ్విని దత్ (వైజయంతీ మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణతో ‘అగ్ని పర్వతం’, మహేష్ బాబును ‘రాజకుమారుడు’తో పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు మూడో తరం స్టార్ జయ కృష్ణను పరిచయం చేయడం విశేషం. ‘చందమామ కథలు’ బ్యానర్‌పై పి. కిరణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
పోస్టర్లో హీరో, హీరోయిన్ల చేతులు పెనవేసుకుని ఉండటం చూడొచ్చు. హీరో గాయపడిన చేయి పట్టుకున్న నాటు గన్ను, దాన్ని గట్టిగా పట్టుకున్న హీరోయిన్ చేయి బంధాన్ని చూపిస్తున్నాయి. ఇది రొమాన్స్ మరియు హై-స్టేక్స్ యాక్షన్ కలబోసిన కథ అని సూచిస్తోంది. అలాగే పవిత్ర తిరుమల దేవాలయం, శేషాచలం కొండలు కనిపించడం సినిమాకు ఆధ్యాత్మిక మరియు లోతైన నేపథ్యాన్ని జోడించాయి. “రెండు జీవితాలు – ఒకే ప్రయాణం. రెండు చేతులు – ఒకే వాగ్దానం. రెండు హృదయాలు – ఒకే గమ్యం” అనే క్యాప్షన్ ప్రీ-లుక్కు మరింత బలాన్ని ఇచ్చింది. బాలీవుడ్ నటి రాషా థడానీ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇటీవలే అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జయ కృష్ణ ప్రస్తుతం తన పాత్ర కోసం శిక్షణ పొందుతూనే షూటింగ్లో పాల్గొంటున్నారు. టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్‌తోనే భారీ బజ్‌ను సృష్టించిన మేకర్స్, త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.