Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం పుష్ప 2. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పుష్ప-2 కోసం ప్రచారం కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కి వచ్చిన సమయంలో తొక్కిసలాట జరగడంం, ఆ సమయంలో రేవతి అనే మహిళ తనువు చాలించడం మనకి తెలిసిందే. రేవతి కుమారుడు 9 ఏళ్ళ శ్రీతేజ్ గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గత ఐదు నెలలుగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే కాస్త కోలుకున్న శ్రీతేజ్ ఎట్టకేలకు డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు ఐదు నెలలుగా శ్రీతేజ్ కి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది.
మొత్తం నాలుగు నెలల 25 రోజులు శ్రీతేజ్ కిమ్స్‌లో చికిత్స పొందగా, ఇప్పుడు హాస్పిటల్ నుండి రీహాబిలిటేషన్ సెంటర్‌కు కుటుంబసభ్యులు తరలించారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని అతని తండ్రి మీడియాకి చెప్పారు. ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని.. నిలకడగా ఉన్న శ్రీతేజ్‌కు 15 రోజుల ఫిజియోథెరపీ సూచించినట్టు తెలిపారు. శ్రీ తేజ్ ఇప్పటికీ తన తండ్రిని, ఇతరులని గుర్తించలేకపోతున్నాడట. అతను లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. తొక్కిసలాట సంఘటనలో ఊపిరి ఆడకపోవడం వల్ల శ్రీతేజ్ కి బ్రెయిన్ సమస్యలు తలెత్తాయి.
శ్రీతేజ్ చికిత్స కోసం అల్లు అర్జున్, మైత్రి మూవీస్ సంస్థ, అదే విధంగా టాలీవుడ్ లో కొందరు ప్రముఖులు ఆర్థిక సాయం అందించిన విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ అయితే ఏకంగా కోటి రూపాయల సాయం అందించగా, మైత్రి సంస్థ 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు అందించారు. శ్రీతేజ్ చికిత్స విషయంలో పుష్ప2 యాజమాన్యం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి తమకు చాలా మద్దతు లభించిందని శ్రీతేజ్ తండ్రి అన్నారు.ఇప్పటి వరకు కిమ్స్ వైద్యులు డబ్బులు అడగలేదని, డిశ్చార్జ్ సమయంలోను బలవంత పెట్టలేదని శ్రీతేజ్ తండ్రి స్పష్టం చేశారు. శ్రీతేజ్ తల్లి అమ్మ ఏదని అడుగుతుందని, ఊరెళ్లిందని చెబుతున్నామని ఆయన అన్నారు.