‘ఉగ్రం’ సినిమాతో కన్నడనాట మాస్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు శ్రీమురళి. ఆయన తాజా చిత్రం ‘బఘీర’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ కథనందించిన ఈ చిత్రానికి సూరి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో శ్రీమురళి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది. ప్రతి ఒక్కరిలో హీరో ఉంటాడు. పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు మనలోని హీరో బయటకొస్తాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ హీరోల్లాగానే ఫీలవుతారు. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌గా, మాస్క్‌మ్యాన్‌గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తా’ అని చెప్పారు.
ఈ సినిమాకు అద్భుతమైన కథతో పాటు మంచి టీమ్ కుదిరిందని, ప్రకాష్‌రాజ్ వంటి సీనియర్ నటుడితో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని శ్రీమురళి అన్నారు. తెలుగులో తన తొలి చిత్రమిదని, ఇక్కడి ప్రేక్షకుల ఆశీస్పులు తనకు కావాలని ఆయన కోరారు. సినీరంగంలో ఇరవైఏండ్ల ప్రయాణం గురించి మాట్లాడుతూ ‘ఈ జర్నీ అద్భుతంగా సాగుతోంది. ‘ఉగ్రం’ తర్వాత కన్నడలో మంచి బ్రేక్ దొరికింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014 నుంచి నా సినిమాలన్నీ సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. కథ బాగుంటే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి కూడా సిద్ధమే’ అని చెప్పారు.