Sri Chidambaram Garu | టాలీవుడ్ నుంచి మరో వినూత్న కథాంశంతో తెరకెక్కిన సినిమా రాబోతుంది. యువ నటీనటులతో ‘శ్రీ చిదంబరం గారు’ అంటూ ఈ చిత్రం రాబోతుండగా.. సాధారణంగా సినిమాల్లో శారీరక లోపాలను కేవలం హాస్యం కోసమే వాడుకుంటారు కానీ ఈ చిత్రంలో మెల్లకన్ను ఉన్న ఒక యువకుడు సమాజంలో ఎదుర్కొనే అవమానాలు, అతనిలో ఉండే ఇన్‌సెక్యూరిటీలు, అతని భావోద్వేగపూరితమైన ప్రేమకథను దర్శకుడు వినయ్ రత్నం చాలా హృద్యంగా ఆవిష్కరించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సానా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
మెల్లకన్ను కారణంగా తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కళ్ళద్దాలు ధరించే కథానాయకుడు, ఒక అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత తన బలహీనతను ఎలా అధిగమించాడనేది ఈ సినిమా ప్రధానాంశం. హీరో వంశీ తుమ్మల ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన మేనరిజమ్స్‌తో కష్టపడగా, సంధ్యా వశిష్ట కథానాయికగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే నేటి యువతకు తమ లోపాన్నే బలంగా మార్చుకోవాలని చెప్పే ఒక నిజాయితీ గల స్ఫూర్తిదాయకమైన ప్రయత్నమని ప్రశంసించారు.
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని చింతా వినీషా రెడ్డి మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. చందు రవి సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గారు ఒక పాట పాడటం విశేషం. “నీ లోపం నీకు బలహీనత కాకూడదు, అది నీ బలం అవ్వాలి” అనే చక్కని సందేశంతో వస్తున్న ఈ గ్రామీణ ప్రేమకథ ఫిబ్రవరి 6 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.