తెలుగు ఇండస్ట్రీలో అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా గుర్తుంపును తెచ్చుకుంది అచ్చ తెలుగందం శ్రీలీల. జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ చిత్రాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఓ ఫొటో అందరిలో ఆసక్తిని పెంచింది. ఆమె కుటుంబ సభ్యులు పసుపు, కుంకుమ రాసి ఆశీర్వదిస్తున్న ఫొటోలను పంచుకున్న శ్రీలీల..వాటికి ‘బిగ్డే’ ‘కమింగ్ సూన్’ అనే క్యాప్షన్లను జత చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు .. శ్రీలీల నిశ్చితార్థ వేడుకను జరుపుకుందని కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరేమో ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం శ్రీలీల ఈ ఫొటోలను షేర్ చేసిందని, ఎంగేజ్మెంట్ వంటి ప్రత్యేక సందర్భాన్ని ఆమె ఎందుకు గోప్యంగా ఉంచుతుందని అభిప్రాయపడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిశ్చితార్థ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిసింది. శ్రీలీల కుటుంబ సభ్యులు ఇంట్లో జరిగే ప్రతీ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారని, ఈ ఫొటో కూడా అలాంటి వేడుక సందర్భంగా తీసిందేనని అంటున్నారు. ఏదిఏమైనా ఒక్క ఫొటో అభిమానుల్లో అనేక చర్చలకు దారితీసింది.