Sreeleela |సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని కోలీవుడ్‌లో భారీ హైప్‌తో విడుదలైన పరాశక్తి తొలి షోల నుంచే మిశ్రమ స్పందనను అందుకుంటోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రవి మోహన్ విలన్ పాత్ర, అథర్వ కీలక పాత్రతో పాటు, శ్రీలీల కోలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలి సినిమా కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల్లో కథ ఉద్దేశం బాగున్నప్పటికీ, కథనం మరింత బలంగా ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. స్క్రీన్‌ప్లేలో సరైన ఉత్కంఠ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు అనవసరంగా లాగినట్లు అనిపించడం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందని టాక్.
దీంతో వాయిదా పడిన ఇతర భారీ చిత్రాల వల్ల ఏర్పడిన ఖాళీని పరాశక్తి పూర్తిగా భర్తీ చేయలేకపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న శ్రీలీలకు ఫలితం మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలు చేసినప్పటికీ, ఇటీవల ఆమె నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేకపోయాయి. అందంతో పాటు డాన్స్, ఎనర్జీ ఉన్నప్పటికీ, సరైన బ్రేక్ కోసం ఆమె ఇంకా ఎదురుచూస్తూనే ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.
సుధా కొంగర సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు సాధారణంగా బలంగా ఉంటాయన్న పేరు ఉంది. అలాంటి దర్శకురాలి సినిమాలో అవకాశం రావడంతో శ్రీలీల పాత్ర కెరీర్ మలుపు అవుతుందని భావించారు. లుక్‌లో మార్పులు, నటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినా, ‘రత్నమాల’ పాత్ర ప్రేక్షకులపై పెద్దగా ముద్ర వేయలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, సినిమాకు సంబంధించిన కొన్ని డైలాగులు వివాదాలకు దారితీశాయి. ముఖ్యంగా తమిళ వెర్షన్లో ఉపయోగించిన కొన్ని పదాలపై తెలుగు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. సెన్సార్ చేసినప్పటికీ ఆ అంశంపై నెగిటివ్ ప్రచారం సినిమాపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే, కోలీవుడ్‌లో కొత్త ఆశలతో అడుగుపెట్టిన శ్రీలీలకు పరాశక్తి పెద్ద బ్రేక్‌ను ఇవ్వలేకపోయిందనే భావన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌పై ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా విజయం సాధిస్తే, మళ్లీ ఆమె కెరీర్‌కు కొత్త ఊపిరి దక్కే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.