ప్రస్తుతం బాలీవుడ్లో శ్రీలీల ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకుడు. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే.. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయడం లేదంటూ దర్శకుడు అనురాగ్ బసు పెద్ద బాంబ్ పేల్చారు. అనురాగ్ నుంచి ప్రకటన రాగానే.. బీటౌన్ మీడియా ఈ సినిమాపై తోచిన రీతిలో కథనాలు అల్లేశాయి.
ఈ సినిమా కథతో రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘సయారా’ కథ పోలి ఉండటంతో కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని, అందుకే ఆలస్యం అవుతున్నదని ఓ కథనం విపరీతంగా వైరల్ అవుతున్నది. దీనిపై మళ్లీ అనురాగ్ స్పందించారు.
“సయారా’ కథకూ మా కథకూ పొంతనే లేదు. హీరో కార్తీక్ ఆర్యన్ డేట్స్ ప్రాబ్లమ్ వల్లే సినిమా విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశాం. ఇప్పటికే షూటింగ్ 40 శాతం పూర్తయింది. మిగతా పార్ట్‌ని త్వరలోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేస్తాం.’ అని అనురాగ్ బసు తెలిపారు . ఏదేమైనా బాలీవుడ్లో శ్రీలీల చేస్తున్న తొలి సినిమా ఇలా వాయిదా పడటం ఆమె అభిమానుల్ని బాధకు గురిచేస్తున్నది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జోడీగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.