హీరో శ్రీవిష్ణు స్పీడ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి గీతాఆర్ట్స్ నిర్మిస్తున్న ‘సింగిల్’ సినిమా. దీనికి కార్తీక్ దర్శకుడు. అలాగే ‘మృత్యుంజయ్’ అనే థ్రిల్లర్ సినిమా కూడా చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఆ సినిమాకు దర్శకుడు హుస్సేన్ షా కిరణ్. ఇప్పుడు తాజాగా మూడో సినిమాక్కూడా ఆయన సైన్ చేసినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ‘స్వాతిముత్యం’ఫేం లక్ష్మణ్ కె.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారట.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని, ‘ఐటమ్’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నారని తెలుస్తున్నది. దాదాపు ఈ టైటిలే ఫైనల్ కూడా కావొచ్చని సమాచారం. తన తొలి సినిమా ‘స్వాతిముత్యం’ మాదిరిగానే ‘ఐటమ్’ సినిమాను కూడా ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ తెరకెక్కిస్తున్నారని వినికిడి. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలో టైటిల్‌ని కూడా అనౌన్స్ చేస్తారట.