స్కిడ్ గేమ్-3
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: లీ జంగ్-జే, లీ బ్యుంగ్-హున్, వి హ-జూన్ తదితరులు..
దర్శకత్వం: హ్వాంగ్ డాంగ్ హ్యుక్
ధనం మూలం ఇదం జగత్!.. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే! ఆ డబ్బు కోసం దేనికైనా సిద్ధపడే మనుషుల కథే.. ఈ స్విడ్ గేమ్! అ‘నాగరికుడి’ నరనరాల్లో ఇంకిపోయిన స్వార్థం, ద్రోహం, మోసం, వెన్నుపోటు, వంచన.. వీటన్నిటినీ కళ్లకు కడుతుందీ వెబ్ సిరీస్! మొత్తం మూడు సీజన్లుగా వచ్చిన ‘స్విడ్ గేమ్’ సిరీస్‌లో.. చివరి భాగం తాజాగా స్ట్రీమింగ్కు వచ్చింది. ఆద్యంతం ఉత్కంఠగా, థ్రిల్ పంచేలా మొత్తం ఆరు ఎపిసోడ్లతో సాగుతుంది.
‘ఆట’లోకి దిగితే.. మనుషుల ప్రాణాలు తీసే ఈ గేమ్స్‌ను ఆపాలనీ, వాటి వెనకున్నది ఎవరో కనిపెట్టాలని అనుకుంటాడు సీజన్-1 విజేత షియెంగ్ జీ హున్ (లీ జంగ్-జే). ఈ క్రమంలో అతనితో మరికొందరు చేతులు కలుపుతారు. అక్కడున్న గార్డ్స్ దగ్గరున్న ఆయుధాలను స్వాధీనం చేసుకొని తిరుగుబాటు చేస్తారంతా. ఇక్కడితో సీజన్-2 ముగుస్తుంది. అయితే, తిరుగుబాటుదారుల్ని చంపేసి.. పరిస్థితులను తమ అధీనంలోకి తీసుకుంటాడు ఫ్రంట్ మ్యాన్. మిగిలిన వాళ్లతో మళ్లీ ఆట మొదలు పెట్టడంతో.. సీజన్-3 మొదలవుతుంది. అయితే, ఈసారి ఆటలో క్రూరత్వాన్ని మరింత పెంచడానికి షియెంగ్ జి-హున్ (లీ జంగ్-జే) వీఐపీ ఆటగాళ్లను దించుతాడు.
మరి ఈసారి ఎలాంటి ఆటలు ఆడతారు? ఆ ఆటల్లో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అవి ఎంతమందిని బలి తీసుకుంటాయి? తాను అనుకున్నట్లు అమాయకులను హీరో కాపాడుతాడా? ‘స్కిడ్ గేమ్’ను నడిపిస్తున్న ఫ్రంట్ మ్యాన్‌ను కనిపెడతాడా? ఫైనల్ సీజన్లో విజేతగా నిలిచింది ఎవరు? అన్నది తెలియాలంటే.. సిరీస్ చూడాల్సిందే! ఆరు ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ సీజన్లో ఆసక్తికరమైన మలుపులు అనేకం. అక్కడక్కడా రక్తపాతం కాస్త ఎక్కువే కనిపిస్తుంది.