Spirit | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా .. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్ (Spirit)’ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ లాంటి సెన్సేషనల్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ప్రభాస్‌తో మాస్ ఎమోషనల్ పోలీస్ డ్రామా చేయబోతుండటంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కాగా, షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గురువారం రాత్రి 11 గంటలకు ‘ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్’ అనే 1 నిమిషం 31 సెకండ్ల గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియోను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. సౌండ్ థీమ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన సందీప్ వంగా మార్క్ స్టైల్ గ్లింప్స్‌లో బలంగా కనిపించింది. ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్న ప్రభాస్ అరెస్ట్ అయ్యే సన్నివేశాలను కేవలం ఆడియో రూపంలో చూపించడం ఆసక్తికరంగా మారింది. ఇందులో ప్రకాశ్ రాజ్ వాయిస్‌తో..“వీడి గురించి విన్నాను… యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదు… చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో!” అనేది వంగా రైటింగ్ శైలిని గుర్తు చేసింది.
ఇక చివర్లో ప్రభాస్ చెప్పిన.. “మిస్టర్ సూపరింటెండెంట్… నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది…” అనే డైలాగ్ గ్లింప్స్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆ ఒక్క లైన్‌తోనే ఆయన పాత్ర ఇంటెన్స్‌గా, రఫ్‌గా ఉండబోతుందనేది స్పష్టమవుతోంది. సినిమా సౌండ్ డిజైన్‌పై మాట్లాడిన సందీప్ వంగా, “సాధారణంగా సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను చివర్లో జత చేస్తారు. కానీ ‘స్పిరిట్’లో మేము ముందే 70 శాతం సౌండ్‌ట్రాక్‌ను సిద్ధం చేశాం. ఆ సౌండ్ ఆధారంగా షాట్లు ప్లాన్ చేస్తున్నాం,” అని చెప్పారు. ఇది భారతీయ సినీ చరిత్రలో అరుదైన ప్రయోగమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, త్రిప్తి దిమ్రీ, ప్రకాశ్ రాజ్, కాంచన వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ సెట్లు, టాప్ టెక్నికల్ టీమ్, అత్యాధునిక యాక్షన్ సీక్వెన్సెస్‌తో సినిమా నిర్మాణం జరుగనుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటితోపాటు త్వరలోనే ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొననున్నారు. సందీప్ వంగా ఈ ప్రాజెక్ట్‌ను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇక తర్వాత ప్రభాస్ లైనప్‌లో ‘కల్కి 2898 AD 2’, ‘సలార్ 2’ వంటి పెద్ద ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.