Harihara Veeramallu Special screenings | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లుస చిత్రాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో నివసిస్తున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వారాంతపు సెలవు దినాలైన శనివారం (జూలై 26) మరియు ఆదివారం (జూలై 27) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో రెండు షోలు వేయనున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి 7 గంటలకు జరిగిన మొదటి షోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని.. ఆడిటోరియం ప్రేక్షకులతో నిండిపోయిందని రెసిడెంట్ కమిషనర్ వెల్లడించారు. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరో షోను ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మెరుగుపరచడమే ఈ ప్రదర్శనల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.