కొన్ని దశాబ్ధాలుగా తన నటనతో పాటు సేవా కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 66 ఏళ్ల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న చిరంజీవిని చూసి కుర్ర హీరోలు ఆశ్చర్యపోతున్నారు. చిరు సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఆయన బర్త్ డే సందర్భంగా పలు సర్ప్రైజ్లు ఇచ్చారు మేకర్స్.
ఆగస్ట్22న చిరంజీవి 66వ వసంతంలోకి అడుగుపెట్టడంతో ఆయనపై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపించారు. తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్‌కి చెందిన బిందు ప్రియాంక, ఆనంద్ 955 రూబిక్ క్యూబ్స్‌తో 6.5 అడుగుల ఎత్తయిన చిత్ర పటాన్ని తయారుచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చిరు ఫొటోని అద్భుతంగా డిజైన్ చేయడం పట్ల నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొందరు రక్తదానం చేస్తే మరి కొందరు ఫ్రూట్స్, పుస్తకాలు విరాళంగా అందించారు. ఇంకొందరు అభిమానులు అయితే ఆయన చిత్ర పటాలకు పూల మాలలు వేసి పాలాభిషేకాలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు అందరు చిరుకి శుభాకాంక్షలు తెలియజేశారు.