స్పేస్ జెన్: చంద్రయాన్
తారాగణం: శ్రియా శరణ్, నకుల్ మెహతా, ప్రకాశ్ బేలావాడీ, ప్రతీక్ గాంధీ తదితరులు
దర్శకత్వం: అనంత్ సింగ్ భాటు
రోదసిలో ప్రయోగాలు, స్పేస్ రీసెర్చ్ సినిమాలు అంటే.. అందరికీ హాలీవుడ్ గుర్తొస్తుంది. ఎందుకంటే, ఇలాంటి సబ్జెక్ట్‌ను తెరకెక్కించడం ఎంతో సవాల్‌తో కూడుకున్నది. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కంటెంట్‌ను క్రియేట్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇలాంటి క్రిటికల్ జోనర్లో తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లోనూ అనేక సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘చంద్రయాన్’ నేపథ్యంలో.. ‘స్పేస్ జెన్: చంద్రయాన్’ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చి.. రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతున్నది.
ఈ సిరీస్ కథలోకి ఎంట్రీ ఇస్తే.. అంతరిక్ష యాత్రల చరిత్రలో చంద్రుని మీదికి వెళ్లేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి. అయినా, నీటి జాడ గురించి తెలిపిన మొదటి ప్రయోగం మాత్రం.. భారత్ చేపట్టిన ‘చంద్రయాన్’ మాత్రమే! దాంతో చంద్రయాన్-2 ల్యాండర్‌ను కూడా ప్రయోగించాలని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు చాలా కష్టపడి పనిచేస్తుంటారు. శాస్త్రవేత్తలు యామిని ముదలియార్ (శ్రియా శరణ్), అర్జున్ వర్మ (నకుల్ మెహతా), సుదర్శన్ రామయ్య (ప్రకాశ్ బేలావాడీ), జైరామ్ శెట్టి (డానిష్ సెయిత్), ఇతర శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.
కానీ, ఆ ప్రయోగం చివరి నిమిషంలో ఫెయిల్ అవుతుంది. దాంతో రాజకీయంగా, మేధావి వర్గంతోపాటు మీడియా, సాధారణ ప్రజల నుంచీ విమర్శలు వస్తాయి. ఈ వైఫల్యాలను సమీక్షించుకొంటూ మరో ప్రయోగం చేస్తే.. అందులోనూ వైఫల్యమే ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రయాన్-3 ప్రయోగించాలని ప్లాన్ చేస్తారు శాస్త్రవేత్తలు.
అంతలోనే వారి ప్రయత్నాలకు కరోనా మహమ్మారి అడ్డుగా నిలుస్తుంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. కష్టతరమైన మిషన్‌ను వారు ఎలా ముగించగలిగారు? ఈ క్రమంలో ఇతర దేశాల నుంచీ, ప్రకృతి నుంచీ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? వాటిని అధిగమించి భారత్ ఎలా నిలదొక్కుకుని గర్వంగా నిలిచింది? చంద్రయాన్-2 ప్రయోగం ఎందుకు ఫెయిల్ అయింది? దాని వెనకున్నది ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే.. ‘స్పేస్జెన్: చంద్రయాన్’.